వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్ పోల్ తొలగించడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంపై కేంద్రాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. గుజరాత్లోని మోసగాళ్లందరికీ ప్రత్యేక మినహాయింపు ఉందా అంటూ కేంద్రాన్ని ఆయన నిలదీశారు.
మెహుల్ చోక్సీని భారత్ కు రప్పించాలని కేంద్రం, సీబీఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. చోక్సీపై జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్ పోల్ విత్ డ్రా చేసుకుంది. రెడ్ కార్నర్ నోటీసులు ఇంటర్ పోల్ వెబ్ సైట్ లో కనిపించడం లేదు.
2018 డిసెంబర్లో ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును రద్దు చేయాలని కోరుతూ చోక్సీ అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై ఇంటర్ పోల్ ఈ ఏడాది జనవరిలో నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్ పోల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది.
రెడ్ కార్నర్ నోటీసులను ఇంటర్ పోల్ విత్ డ్రా చేసుకున్న నేపథ్యంలో కేంద్రంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతన్నాయి. పరారీలో వున్న ఆర్థిక నేరగానికి ప్రభుత్వం విముక్తి కల్పించిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు.