అసెంబ్లీ వేదికగా కేటీఆర్ తెలంగాణ ప్రజలకు కొన్ని వరాలు కురిపించారు. శాసనసభలో ప్రశ్నొత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ అంటే ఛార్మినార్ అని అందరికీ తెలుసని వ్యాఖ్యనించారు. నగరంలో రూ.985.45 కోట్లతో నాలాల అభివృద్ధి చేపడతామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలాల అభివృద్ధి కొనసాగుతుందన్నారు. మోక్ష గుండెం విశ్వేశ్వరయ్య తర్వాత అంతా విజన్ ఉన్న వ్యక్తి కేసీఆర్ మాత్రమేనని చెప్పారు.
హైదరాబాద్ నాలాలపై 28 వేల ఇళ్ల కబ్జాలు ఉన్నాయని.. నాలాల అభివృద్ధి చేయాలంటే 28 వేల పేదల ఇళ్లు కుల్చాల్సి వస్తుందన్నారు. అలా చేస్తే ధర్నాలు, రాస్తారొకోలు చేస్తారన్నారు. ప్రజా ప్రతినిధులు సహకరిస్తే నాలాలపై ఉన్న ఇళ్లను తొలగిస్తామన్నారు.
దేశంలోనే హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని.. దేశానికి నగరం ఎకానమిక్ ఇంజిన్ గా మారిందన్నారు. ఇటువంటి నగరానికి చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం మొండిచెయి ఇస్తుందన్నారు. మెట్రో రైల్ విషయంలో కేంద్రం సహకరించడం లేదన్నారు. చెన్నై, బెంగుళూరు సహా ఇతర బీజేపీ పాలిత నగరాల్లో మాత్రం మెట్రో రైలుకు కేంద్రం సహకరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మూడేళ్లలో శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రోను పూర్తిచేస్తామన్నారు. అదేవిధంగా మెట్రో రైలులో యాడ్స్ ఉండాలని కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయమని చెప్పారు.
అదే విధంగా ప్రతిపక్ష నేతల పై కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. 55 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిందేమిలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. 9నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 9 నెలల్లో పిల్లలు పుడతారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం మాత్రం కష్టమన్నారు.