కేంద్ర దర్యాప్తు సంస్థల్ని కేంద్రం వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ప్రజాస్వామ్యాన్ని చంపేసేందుకే ఇవి పని చేస్తున్నాయా? అని మండిపడ్డారు. కర్నాటకలో ఎమ్మెల్యే కుమారుడు 40 లక్షల లంచం తీసుకున్నాడని.. అక్కడైతే ఎలాంటి చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. అదానీ కంపెనీ.. మోడీ సొంత కంపెనీ అంటూ ఆరోపణలు చేశారు. అందుకే, ప్రపంచవ్యాప్తంగా తిరిగి మోడీ ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు.
అదానీకి చెందిన ముద్రా పోర్టులో హెరాయిన్ దొరికిందని.. వాటి రూ.21వేల కోట్ల వరకు ఉంటుందని అన్నారు కేటీఆర్. ఇంత జరిగినా? ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అదానీని విచారణకు పిలిచే దమ్ముందా? అని అడిగారు. మునుగోడులో ఓ వ్యక్తికి రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వలేదా? అంటూ ఫైరయ్యారు. ‘‘బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజన్ లో ఒక ఇంజన్ మోడీ, మరో ఇంజన్ అదానీ.. రెండు కలిపితే డబుల్ ఇంజన్ మోదానీ’’ అంటూ చమత్కరించారు కేటీఆర్.
దొంగ సొమ్ముతో ప్రభుత్వాలను కూలుస్తున్నారని.. 9 ఏళ్ల పాలనలో 9 ప్రభుత్వాలను కూల్చలేదా? అని నిలదీశారు. అదానీ కోసం పాలసీలు మార్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 95 శాతం దాడులు విపక్షాలపైనే ఎందుకన్న ఆయన.. బీజేపీ నేతలపై పెట్టిన ఒక్క కేసైనా చూపగలరా? అంటూ కడిగిపారేశారు. మోడీ, అదానీ చీకటి స్నేహం ఎవరికి తెలియదన్న కేటీఆర్.. కర్నాటకలో 40 శాతం కమిషన్ నడవడం లేదా? అని ప్రశ్నించారు. అధికారం కోసం దిక్కుమాలిన పనులన్నీ చేస్తున్నారని బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.