బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై ఎట్టకేలకు మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో 8 సంవత్సరాలుగా ఓ ప్రహసనం నడుస్తోందన్నారు. అయితే జుమ్లా లేదా హమ్లా అన్నదే మోడీ విధానమన్న కేటీఆర్.. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీఆర్ఎస్ పై ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.
ఇన్నేళ్లలో గంగుల, మల్లారెడ్డి, తలసాని, నామా, వద్దిరాజు, రమణ, మంచిరెడ్డి, రోహిత్ రెడ్డి.. ఇలా 12 మంది నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీని ఉసిగొల్పారని ఆరోపించారు కేటీఆర్. కవితకు పంపినవి ఈడీ సమన్లు కాదని.. మోడీ సమన్లు అంటూ ఎద్దేవ చేశారు. కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మ.. ఈడీ తోలుబొమ్మ అంటూ విమర్శలు చేశారు. 2014 నుంచి ఈడీ దాడులన్నీ విపక్షాలపైనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.
మోడీ, ఈడీ కలిసి ఇప్పటికాదా 5,422 కేసులు పెట్టాయని.. వాటిలో కేవలం 23 కేసుల్లో మాత్రమే నేరం రుజువైందన్నారు కేటీఆర్. బీజేపీలో చేరితే అంతా వాషింగ్ పౌడర్ నిర్మా.. మాదిరిగా అవుతుందా? అంటూ సెటైర్లు వేశారు. సుజనా చౌదరిపై రూ.6వేల కోట్ల కేసు ఏమైందని అడిగిన మంత్రి.. హిమంత శర్మపై కేసులు ఏమయ్యాయని అడిగారు. బీబీసీనే లెక్క చేయనని మోడీ సంకేతాలు ఇచ్చారని.. ప్రశ్నిస్తే ఎవరినైనా ఉతికి ఆరేస్తా అనే సంకేతాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.