ఓక్రిడ్జ్ స్కూల్ కాస్నివాల్ లో మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సృజనాత్మక, సామాజిక థృక్పథం థీం తో నిర్వహించిన కాస్నివాల్ కు ఇంఛార్జిగా వ్యవహిరించాడు హిమాన్షు. ఈవెంట్ లో భాగంగా ఏర్పాటుచేసిన 30కి పైగా స్టాల్స్ తో విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు. ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రదర్శనగా కొనసాగిన ఈ ఈవెంట్ లో ఓక్ జైలు, సైకిల్ పెయింటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ తో తమలోని ప్రతిభను చూపించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఈవెంట్ కు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కాస్నివాల్ కు ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. స్టాల్స్ ను పరిశీలించారు. హిమాన్షు అతని స్నేహితుల సృజనాత్మకత, సామాజిక దృక్పథాన్ని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నేటితరం పిల్లల ఆలోచనా విధానానికి ఈ కాస్నివాల్ ప్రతీక అని అన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ కాళ్లపై తాము నిలబడే ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి ఈవెంట్స్ విద్యార్థులకు ఇస్తాయని చెప్పారు.
ప్రైవేట్ పాఠశాలల్లో మాదిరిగానే గవర్నమెంట్ స్కూల్స్ లోనూ పలు ఇన్నోవేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఈ కాలం పిల్లల ఆలోచనలు అందుకోవడం తమ లాంటి వాళ్లకు ఎంతో కష్టమన్నారు. తాము రాష్ట్రాన్ని చదివితే ఈ పిల్లలు ప్రపంచాన్నే చదువుతున్నారని మెచ్చుకున్నారు. హైదరాబాద్ లో మురికి కూపాలుగా మారిన చెరువులను పునరుద్దరించేందుకు సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈ ఈవెంట్ తో వచ్చిన డబ్బులతో స్కూల్ ఎదురుగా ఉన్న నానక్ రాంగూడ చెరువు సుందరీకరణకు పూనుకోవడం మంచి ఆలోచనగా సంతోషం వ్యక్తం చేశారు.
హిమాన్షు మాట్లాడుతూ… తమ కాస్నివాల్ ఈవెంట్ పర్యావరణం, విద్యకు మధ్య వారధి లాంటిదని చెప్పాడు. తాను చదువుతో పాటు సామాజిక సేవకూ సమ ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు. చదువుకుని మంచి మార్కులు సంపాదించినప్పుడు ఎంత సంతోషిస్తానో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఎవరికైనా సాయం చేసినప్పుడు వాళ్ల ముఖంలో కనిపించే చిరునవ్వులో పొందుతానని చెప్పాడు. నానక్ రాంగూడ చెరువును పునరుద్దరిస్తాని.. ఆ ప్రయత్నంలో విజయవంతం అయిన రోజు ప్రపంచాన్నే గెలిచినంత గొప్పగా ఫీలవుతానని తెలిపాడు.
ఓక్రిడ్జ్ లో ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ కాస్నివాల్ ఈవెంట్ లో సినీ హీరోలు నిఖిల్, కిరణ్ అబ్బవరం సందడి చేశారు.