రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ఎల్లారెడ్డిపేటలో మున్నూరు కాపు సంఘ భవనాన్ని ప్రారంభించి వెళ్తున్న మంత్రిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తమకు డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని ఎన్నాళ్ల నుండో అడుగుతున్న పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో జరిగిన తోపులాటలో ఓ కార్యకర్తకు గాయాలయ్యాయి.
టిఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బిజేపి కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి దాడికి పాల్పడ్డ టిఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై టిఆర్ఎస్ గుండాలు దాడి చేశారని ఆరోపించారు. పార్టీకి సంబంధం లేని మైనార్టీ యువకుడిపై మంత్రి సమక్షంలోనే టిఆర్ఎస్ గుండాలు దాడి చేశారని, దాడికి మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.