ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం రేపుతోంది. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్ర రాజకీయం ఢిల్లీకి చేరినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే విచారణ నిమిత్తం కవిత ఢిల్లీకి వెళ్లారు. మహిళా రిజర్వేషన్లపై ఆమె దీక్ష చేస్తున్నారు.
తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీకి హుటా హుటిన పయనమయ్యారు. బీఆర్ఎస్ విస్తృత సమావేశం ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు మరి కొందరు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే కవిత ఈడీ విచారణ విషయంలో కేసీఆర్ స్పందించారు.
ఈ కేసులో కవితను అక్రమంగా ఇరికిస్తున్నారంటూ సీఎం పేర్కొన్నారు. విచారణ పేరుతో కవితను రేపు ఈడీ అరెస్టు చేసి ఇబ్బంది పెట్టే అవకాశాలు వున్నాయంటూ ఆయన వెల్లడించారు. అందర్నీ వేధిస్తున్నారని, కేసులకు భయపడేది లేదన్నారు.
కవితను అరెస్టు చేసే అవకాశం ఉందన్న సమాచారం మేరకే కేసీఆర్ అలా మాట్లాడి వుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేస్తే ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ ఆందోళన చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి వుంటారనే చర్చలు నడుస్తున్నాయి.