తమ కుటుంబ చరిత్ర తెలుసుకోకుండా తమపై నిందలు వేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం కోనాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కేసీఆర్ పుట్టిన నాడే వందల ఎకరాలు ఉన్న ఇంట్లో పుట్టిండని, ఆయనకు ఆస్తులు కొత్త కాదు.. పొలం మధ్యలో ఇల్లు కట్టుకుంటే ఫామ్ హౌజ్ అని పేరు పెట్టి, అడ్డగోలు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 60 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇస్తున్నామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని సస్యశామలం చేశామని అన్నారు. 60 ఏళ్లల్లో జరగని అభివృద్ధి 7 ఏళ్ళల్లో చేశామన్నారు. తెలంగాణలో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తమ నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కోనాపూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. అనంతరం నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా రూ. రెండున్నర కోట్లతో నిర్మించే స్కూల్ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేశారు. కోనాపూర్ గ్రామానికి సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్, తాగునీటి కోసం 2 కిలోమీటర్ల పైపు లైన్, రెండు బస్ షెల్టర్లు, మినీ లైబ్రరీ, మినీ డెయిరీ, మహిళా మండలి భవనం, కొన్ని కుల సంఘాల భవనాలు, గ్రామపంచాయతీకి ప్రహరీ గోడ, పశువైద్య శాల, డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు దళితబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే మంజూరు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
అలాగే, మానేరు ప్రాజెక్టుకు తమకు అవినాభావ సంబంధం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తమ పూర్వీకుల గురించి చెప్పుకొచ్చారు. నానమ్మ ఊరు అప్పర్ మానేరులో, అమ్మమ్మ ఊరు మిడ్ మానేరులో, ఇంకో అమ్మమ్మ(అమ్మమ్మ సోదరి) ఊరు కూడా లోయర్ మానేరులో మునిగిపోయిందని గుర్తు చేశారు. నానమ్మ, అమ్మమ్మల జ్ఞాపకార్థంగా మన ఊరు-మన బడి ప్రోగ్రాం కింద తన సొంత ఖర్చులతో పాఠశాలలను నిర్మిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.