దావోస్ లో జరుగుతున్న ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు తెలంగాణ మంత్రి కేటీఆర్. జురిక్ నగరంలో ఎన్నారైలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న కేటీఆర్ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. దావోస్ వచ్చిన ప్రతిసారీ ప్రవాస భారతీయులు ఇచ్చే మద్దతు చాలా గొప్పగా ఉంటుందన్నారు. దేశంలో ఉన్న వాళ్లతో పోల్చుకుంటే ప్రవాస భారతీయులకు దేశ వ్యవహారాలు, స్థానికంగా ఉన్న అంశాలు, అభివృద్ధి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు కేటీఆర్. తమ ప్రభుత్వం ఇప్పటికే అనేక రంగాల్లో సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తున్నప్పటికీ.. మరింత అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఇంకా ఉందన్నారు. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని చెప్పిన మంత్రి.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రావాలని ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుబడులు వస్తే మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్న కేటీఆర్.. ప్రభుత్వ విధానాలను, పరిస్థితులను తమ స్థాయిలలో ప్రచారం చేసి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నం చేయాలని వారిని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన పనితీరుతో గొప్ప ప్రగతిని సాధిస్తున్నాయని వివరించారు. తాను కూడా ఒక ప్రవాస భారతీయుడినే, కొంతకాలం విదేశంలో పనిచేసి భారత్ కు వెళ్లానన్నారు.
ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పలు తెలుగు ఎన్నారైల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జనవరి 16 నుంచి 20 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) సమావేశం జరగనుంది. ప్రపంచంలోని ముఖ్యనేతలతో పాటు పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ, వ్యాపార నాయకులు దీనికి హాజరవుతారు. వారితో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ టూర్ కొనసాగనుంది.