– కేంద్రం ప్రైవేట్ కుట్రలు ఆపాలి
– ఇంకెన్నాళ్లు మిత్రులకు దోచిపెడతారు
– వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కావాలనే నష్టాల్లోకి నెడుతున్నారు
– కార్పొరేట్ ఫ్రెండ్స్ కు కట్టబెట్టే పన్నాగం చేస్తున్నారు
– మోడీ కుట్రలను జనం తిప్పికొడతారు
– కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
కేంద్రంపై మరోమారు విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. రోజూ ఏదో ఒక అంశంపై బీజేపీ సర్కార్ ను నిలదీస్తున్న ఆయన.. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్నర్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలన్న కేటీఆర్.. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్రం మానుకోవాలని డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న కుట్రలను ఎప్పటికప్పుడు కార్మికులు, ఇతర సంఘాలు, బీఆర్ఎస్ వంటి పార్టీలు అడ్డుకుంటున్న నేపథ్యంలో… కేంద్రం దొడ్డిదారిన ప్రైవేట్ కు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని వెల్లడించారు కేటీఆర్. వర్కింగ్ కాపిటల్, ముడి సరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ఏకంగా ఒక నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.
ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో భారీ ఎత్తున సిమెంట్ ను ఉత్పత్తి చేసిన పరిశ్రమలన్నింటినీ పూర్తిగా ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని ప్రభుత్వాలు.. ప్రస్తుతం స్టీల్ పరిశ్రమను కూడా అదే రీతిన ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ప్రైవేటుపరం చేసే ముందు, దాన్ని నష్టాల పాలు చేసి వాటిని సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రైవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందని అన్నారు కేటీఆర్. దీంతో ఉత్పత్తి ఖర్చులో 60శాతం వరకు పూర్తిగా ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పేరిట గతిశక్తి వంటి కార్యక్రమాలతో ముడిపెట్టి కేంద్రం గొప్పలు చెప్పుకుంటోందని.. కానీ ప్రాజెక్టులకు అత్యంత కీలకమైన స్టీల్ ఉత్పత్తిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూడటం కేంద్ర ప్రభుత్వ నిబద్ధత లోపాన్ని తేటతెల్లం చేస్తుందని స్పష్టంచేశారు.
నష్టాలను సాకుగా చూపించి తన కార్పొరేట్ కంపెనీల మిత్రులకు 12.5 లక్షల కోట్ల రూపాయలను రద్దు చేసిన ప్రధానమంత్రి మోడీకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం కనికరం ఎందుకు ఉండడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కి 7.3 ఎంటీపీఏ కెపాసిటీ ఉన్నా, కేవలం ముడి సరుకును, మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల పూర్తిస్థాయి కెపాసిటీతో పనిచేయలేకపోతోందని వివరించారు. ప్రస్తుతం పని చేస్తున్న 50 శాతం కెపాసిటీకి కూడా 100 శాతం కెపాసిటీ ఉత్పత్తికి అయ్యే ఖర్చే అవుతుందని చెప్పారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తే 100శాతం కెపాసిటీతో పని చేయడం వల్ల అనేక ఖర్చులు కలిసి వచ్చి స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందని స్పష్టంచేశారు. ఇప్పటికైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వర్కింగ్ కాపిటల్ పేరుతో ప్రైవేట్ కంపెనీలతో కలిపే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్.