పెట్రోలు ధరలపై ప్రధాని మోడీని టార్గెట్ చేసి తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2014లో బీజేపీ సర్కార్ ఏర్పడిన సమయంలో క్రూడాయిల్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ పెట్రో ధరలు తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.
కానీ ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ పెట్రో ధరలు మాత్రం మండిపోతున్నాయని చెప్పారు. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెట్రో భారం ఎందుకు మోపుతున్నారని, ఈ పెంపుతో ఎవరికి లాభమని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న ఇంధర ధరలపై ప్రధాని నరేంద్ర మోదీడీకి సూటి ప్రశ్న అంటూ ఆయన ట్వీట్ చేశారు. 2014 మే నెలలో ముడి చమురు ధర బ్యారెల్ కు 107 డాలర్లు ఉండగా లీటర్ పెట్రోల్ ధర రూ.71 ఉందన్నారు. ఆ తర్వాత 2023 మార్చి నాటికి క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 65 డాలర్లకు తగ్గిందనీ, కానీ లీటర్ పెట్రోల్ ధర రూ.110కి పెరిగిందని తెలిపారు.
క్రూడాయిల్ ధర పెరిగినప్పుడు దేశంలో ఇంధన ధరలను పెంచాల్సి వచ్చిందని, మరి క్రూడాయిల్ ధర తగ్గినప్పుడు ఇంధన ధరలను తగ్గించ కూడదా..? అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ పెంపు వల్ల ఎవరికి ప్రయోజనం..? అని అడిగారు. దీంతో పాటు 2014, 2023 సంవత్సరాల్లో క్రూడాయిల్, ఇంధన ధరల హెచ్చుతగ్గులను పోల్చిచూపే కొన్ని గ్రాఫ్‌లను ట్వీట్ కు జత చేశారు.