– ఏపీలో బీఆర్ఎస్ డైరెక్ట్ ఎటాక్
– ఎవరితోనూ పొత్తులుండవంటున్న నేతలు
– 175 స్థానాల్లో పోటీకి ప్రయత్నాలు
– చేరికలపై దృష్టి సారించిన కేసీఆర్
– మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ బతికున్నప్పుడు కాంగ్రెస్, టీడీపీ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ ఉండేది. ఆయన మరణం తర్వాత జగన్ వైసీపీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత టీడీపీ, వైసీపీ మధ్య పోరు కొనసాగింది. కానీ, ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్యకు జనసేన వచ్చింది. గత అనుభవాల నేపథ్యంలో అన్నీ సరిదిద్దుకుని.. ఈసారి పక్కాగా గెలుపు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పుడు మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. గతంలో టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చింది. కానీ, ఇప్పుడు రెండు పార్టీలు దూరంగా ఉంటున్నాయి. పొత్తుల విషయంలో క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ఏపీలోకి ఎంటర్ అవుతోంది. చేరికలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. ఒక్కొక్కరిని తనవైపు లాగే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీ విషయంలో కేసీఆర్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే పార్టీ ఆఫీస్ ను కూడా ప్రారంభం చేయనున్నారు. జగన్, పవన్ తో ఉన్న సత్సంబంధాల కారణంగా ఏ పార్టీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారో అనే చర్చ జరుగుతోంది. కానీ, బీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఏపీలో బీఆర్ఎస్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ కు ఏపీలోనూ మంచి స్పందన వస్తోందని అన్నారు మల్లారెడ్డి. తెలంగాణ అభివృద్ధిని చూసి ఏపీ ప్రజలు ఆదరిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని.. కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకులు ఇప్పుడు దేశానికి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఏపీ విషయంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 175 స్థానాల్లో పోటీ అంటే.. కచ్చితంగా ఒంటరిగానే పోటీ చేయాలి. దీన్నిబట్టి ఎవరితోనూ పొత్తు ఉండదనేది అర్థం అవుతోంది.
మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా తాము ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు మల్లారెడ్డి. నిజానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇప్పుడు బీఆర్ఎస్ అదే రాగం అందుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. బీఆర్ఎస్ కూడా అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది. ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ ని గెలిపిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని ప్రకటించారు మల్లారెడ్డి. మొత్తానికి మంత్రి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.