– మునుగోడులో జోరుగా ప్రలోభాల పర్వం!
– నియోజకవర్గంలో ఏరులై పారుతున్న మద్యం
– లిక్కర్ బాటిల్ తో మంత్రి మల్లారెడ్డి.. ఫోటో వైరల్
– గ్రామాల్లో ఇంటింటికీ చుక్క బంధు..!
– నాన్ వెజ్ వంటకాలతో విందులు
మునుగోడు ఎన్నిక టీఆర్ఎస్ కు చాలా కీలకం. అందుకే.. వ్యూహాత్మకంగా ఆలోచించి కాంగ్రెస్ కు దగ్గరగా ఉండే వామపక్షాలను తన వైపు తిప్పుకున్నారు కేసీఆర్. కానీ, ఈ మైత్రి ఒక్కటే విజాయన్ని తెచ్చి పెట్టదని ప్రలోభాలకు తెరతీసినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బయటకు వచ్చిన మంత్రి మల్లారెడ్డి ఫోటోనే అందుకు నిదర్శనమని ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి. ఫుల్ బాటిల్ చేతబట్టిన మల్లారెడ్డిని చూసి మునుగోడులో ప్రలోభాల పర్వం ఓ రేంజ్ లో కొనసాగుతోందనే చర్చ జోరందుకుంది.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం 86 మంది నేతల్ని ఇంచార్జ్ లుగా నియమించింది. నియోజకవర్గ పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల వారీగా ప్రముఖ లీడర్లను దింపింది. చండూరు మున్సిపాలిటీకి ఐదుగురిని, చండూరు మండలానికి 11 మందిని, చౌటుప్పల్ మున్సిపాలిటీకి 10 మందిని, చౌటుప్పల్ మండలానికి 12 మందిని, మర్రిగూడ మండలానికి 11 మందిని, మునుగోడు మండలానికి 13 మందిని, నాంపల్లి మండలానికి 11 మందిని, నారాయణపూర్ మండలానికి 13 మందిని ఇంచార్జ్ లుగా అధిష్టానం నియమించింది. వీరి ఆధర్యంలోనే అంతా నడుస్తోంది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం వీళ్లందరినీ ఓట్లు కొనేందుకే నియమించారనే విమర్శలు చేస్తున్నాయి.
చౌటుప్పల్ మండలం సైదాబాద్ గ్రామంలో మంత్రి మల్లారెడ్డి తాజాగా ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామానికి చెందిన కొంతమంది ఓటర్లతో ఓ ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొంతమంది ఓటర్లు మంత్రిని మద్యం కావాలని అడగగా… వెంటనే తెప్పించి స్వయంగా పోశారు. ఆయన కూడా రెండు, మూడు పెగ్గులు వేసినట్లుగా సమాచారం. ఆ సమయంలో ఒకరు సెల్ ఫోన్ తో ఫోటో తీశారు. అదికాస్తా సోషల్ మీడియాకి ఎక్కింది. దీంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. మిగిలిన ఇంచార్జ్ లు కూడా నియోజకవర్గంలో ఇదే పనిలో ఉన్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
గ్రామాల్లో సమావేశాలు, విందులు జోరుగా సాగుతున్నాయి. ఇంటింటికీ చుక్క, ముక్క పథకాన్ని అమలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం మాంసం ఉండడంతో పాటు వారంలో రెండు రోజులు మటన్ ఉండేలా ప్లాన్ చేశారట. గ్రామాన్ని 12 యూనిట్లుగా చేసి దాని పరిధిలోని చురుకైన కార్యకర్తలతో బృందాలను ఏర్పాటు చేశారని వారంతా.. ఓటర్ల వివరాలు సేకరించడం.. వారిని ప్రలోభాలకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. గతంలో కూడా గోడ గడియారాలు, ఇతర పరికరాలను టీఆర్ఎస్ నేతలు పంచారనే ఆరోపణలు ఉన్నాయి.