మంత్రి మల్లారెడ్డి తెగింపు ఈ మధ్య తెగ చర్చనీయాంశమవుతోంది. తన మాటలు, చేతలతో కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లోకెక్కుతున్న ఆయన మరోసారి వివాదాస్పదంగా మారారు. సాధారణంగా మేడ్చల్ జిల్లాకు తానే రాజు- తానే మంత్రి అన్నట్టు మల్లారెడ్డి వ్యవహరిస్తారని తీవ్ర విమర్శలున్నాయి. అది నిజమేనని తాజాగా ఆయన అనుచరులు నిరూపించేశారు.
మల్లారెడ్డి జన్మదినం ( సెప్టెంబర్ 9) సందర్భంగా మేడ్చల్ జిల్లాల్లో 44వ జాతీయ రహదారిపై పలు చోట్ల హోర్డింగులు పెట్టారు. మున్సిపల్ నాల్గవ వార్డు కౌన్సిలర్ తుడుం గణేష్ ఏర్పాటు చేసిన వీటిలో ఎక్కడా కూడా కేసీఆర్ బొమ్మ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. బోయినిపల్లి చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ,రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి కుమారులు భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ దీపికా రెడ్డి, వైస్ చైర్మన్ చీర్ల రమేష్ తో పాటు చైర్ పర్సన్ భర్త నర్సింహ రెడ్డి.. ఇలా చాలా మంది ఫోటోలే ఉన్నాయి. కానీ కేసీఆర్ చిత్రం మాత్రం కనిపించకపోవడం చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సాధారణంగా పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగులు, పోస్టర్లు ప్రింట్ చేసినప్పుడు ఎవరైనా ఒక క్రమ పద్దతిని పాటిస్తుంటారు. కానీ ఈ ఫ్లెక్సీల్లో అసలు పద్దతే లేకుండాపోవడంపై గులాబీ శ్రేణులు సైతం గుర్రుమంటున్నాయి. మా ముఖ్యమంత్రి, మా కేసీఆర్, మా దేవుడు అని హైదరాబాద్‌లో స్టేజీలపై తొడగొడుతున్న మల్లారెడ్డి.. తన ప్రాంతాల్లో ఇచ్చే మర్యాద ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధినేతను గౌరవించుకోవాలన్న కనీన సంస్కారం లేకపోతే ఎలా అని విమర్శిస్తున్నారు.