విజయవాడ : ఈ సీఎం మాట తప్పడు.. మడమ తిప్పడు.. కానీ మాటలే మార్చేస్తారు.. అని విసుక్కుంటున్నారు జనం ! రేషన్ కార్డులపై అందరికీ నాణ్యమైన సన్నబియ్యం పౌర సరఫరాల శాఖ ద్వారా సరఫరా చేస్తామని గతంలో మంత్రి కొడాలి నాని ఘనంగా చెప్పారు. అందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి నాని సాక్షి పేపర్ సాక్షిగా చాలాసార్లు ప్రకటించారు. కానీ.. అబ్బే.. ప్రభుత్వం ఎప్పుడూ అలా చెప్పలేదే. అంటూ సంబంధిత శాఖ అధికారి కోన శశిధర్ తేల్చేశారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి గారు కూడా ‘అబ్బే.. మేమెప్పుడూ సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదే..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. గతంలో సీఎం ఆదేశాలతో మంత్రులు, అధికారులతో సన్న బియ్యం సేకరణ, సరఫరాపై రివ్యూ మీటింగ్ పెట్టిన విషయం మంత్రి కొడాలి నాని గారికి గుర్తు లేదేమో మరి..!? సన్న బియ్యం కాకుండా రేషన్ కార్డుల వారందరూ తినగలిగే నాణ్యమైన బియ్యం మాత్రం ఇస్తారట…! సన్నబియ్యం చాలా షార్టేజ్ అట..! 1010, 1001 రకాలకు బదులుగా స్వర్ణ రకం సన్న బియ్యం ఎక్కువగా పండించాలని రైతుల్ని కోరుతున్నారట..! పంట వచ్చేదాకా అందరూ వేచివుండాలట…! ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పైలట్ ప్రాజెక్ట్‌గా ప్లాస్టిక్ సంచుల్లో ప్రస్తుతం స్వర్ణ, బీపీటీ అనుబంధ రకాలైన నాణ్యమైన బియ్యం పంపిణి కార్యక్రమాన్ని సెప్టెంబరు నుంచి మొదలెడతారట…! ఏప్రిల్ నుంచి పర్యావరణ హిత సంచుల్లో నాణ్యమైన బియ్యం రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ఇస్తారట..! ఇది మంత్రిగారి మాట. మార్కెట్లో దొరక్కపొతే ఏంచేస్తారు కానీ.. మడమ తిప్పని ప్రభుత్వంలో మాట మార్చకూడదు కదండీ..!!