తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీరు మరోసారి వివాదాస్పదమైంది. నాగర్ కర్నూల్ జడ్పి సమావేశానికి వెళ్లిన నిరంజన్ రెడ్డి.. మీడియా ప్రతినిధులపై నోరు పారేసుకున్నారు. కవరేజీ కోసం వెళ్లినవారిపట్ల చిర్రుబుర్రులాడారు.
ఇక్కడ మీకేం పని.. మాకు ప్రైవసి లేదా మాకు.. ఏం మాట్లాడుకోకుండా చేస్తున్నారు.. వెళ్లిపోండి.. అక్కడ కూర్చోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్తే అర్థం కాదా మీకు అంటూ అసహనం వెళ్లగక్కారు. అప్పటికే మీడియా ప్రతినిధులు వెనక్కి వెళ్లినప్పటికీ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి వాళ్లను బయటకు పంపించండి అంటూ ఆదేశించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు రావడంతో మంత్రి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక కార్యక్రమానికి వచ్చి ప్రైవసీ అంటూ మాట్లాడటమేంటని మంత్రిపై పలువురు మండిపడుతున్నారు. అటు మీడియా ప్రతినిధులు కూడా నిరంజన్ రెడ్డి పట్ల మండిపడ్డారు.