– నిరుద్యోగులపై మంత్రి సెటైర్లు
– హమాలీ పని పుష్కలంగా ఉందట
యధా రాజా తధా ప్రజా అన్నట్టుంది అధికార టీఆర్ఎస్ నేతల తీరు. ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి.. తీరా గద్దెనెక్కాక అలా ఎప్పుడు అనలేదే అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆరే మాట మార్చినప్పుడు.. గులాబీ వారసులు ఎలా రెచ్చిపోగలరో.. ఉద్యోగాల గురించి ప్రశ్నించినవారికి ఎలాంటి సమాధానం ఇవ్వగలరో ఊహించడం పెద్ద కష్టమేం కాదు. తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ .. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రులకు గొప్ప ఉపదేశమే చేసినట్టున్నారు. 50 వేల ఉద్యోగాలేం ఖర్మ.. ఒక్కో గ్రామానికి 100 ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు మంత్రులకు చెప్పమని పురమాయించినట్టున్నారు. కేసీఆర్ చెప్పమన్నాక.. ఇక మంత్రులు ఊరుకుంటారా!
చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేం.. యాసంగిలో 100 మంది, వాన కాలంలో మరో 100.. ఒక్కో గ్రామంలో 200 మందికి రెండు నెలల పాటు హమాలీ పని దొరుకుతోంది. ఇంతకుమించిన ఉపాధి ఎక్కడైనా ఉందా.. ఇది ఉపాధి కదా.. ఎందుకు నిరుద్యోగులను తప్పుదోవపట్టిస్తారు..? ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు బలవన్మరణాలు చెందుతోంటే.. ది గ్రేట్ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇచ్చిన భరోసా ఇది. హమాలీ పని కూడా ఉద్యోగమేనట.దాంతో నాలుగు నెలల పాటు ఉపాధి దొరుకుతుందట.. ఈ విషయం తెలియక అవనసరంగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారట.
నాగర్ కర్నూల్‌లో ఎంపీ రాములు అధ్యక్షతన జరిగిన సమన్వయ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి.. నిరుద్యోగులకు ఇలా అద్భుతమైన భరోసా కల్పించారు. గ్రామాల్లోనే ప్రభుత్వం ఉద్యోగం చేసుకోవచ్చని ధైర్యం చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఓ వైపు రాష్ట్రంలో వరుసగా నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతోంటే.. వారికి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా చులకన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదరుచూస్తూ, వయసు మీదపడే వరకూ చదువుతున్నవారికి ఈ ఉచిత సలహా ఇచ్చారు.