కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎరువుల ధరలతో పాటు డీజిల్, పెట్రోల్ ధరలను రెట్టింపు చేశారని, తద్వారా వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు కూడా రెట్టింపు అయ్యాయని మంత్రి మండిపడ్డారు.
దేశంలో పండే 53 పంటలకు గాను కేవలం 29 పంటలకే కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నారు. అందులో ప్రధానంగా నాలుగైదు పంటలనే మద్దతుధరకు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా పండిన పంటలో 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని తుంగలో తొక్కారని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చట్టాలు ఉపసంహరించుకున్నప్పుడు రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించారు.
పంట ఉత్పత్తులు పెంచుతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస ప్రోత్సాహం లేదని నిరంజన్ రెడ్డి తెలిపారు. స్వయం సామర్ధ్యంతో అధిక ఉత్పత్తి సాధించిన తెలంగాణ రైతుల వరిధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తున్నది. అసలు కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయం, కొనుగోళ్ల విధానాలపై స్పష్టమయిన విధానం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు