టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం తెలిసిందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
చరిత్ర తెలుసుకుని చంద్రబాబు మాట్లాడాలని ఆయన మండిపడ్డారు. జొన్నకలి, జొన్నయంబలి, జొన్న అన్నం, జొన్న పిసరు, జొన్నలెతప్పన్, సన్న అన్నం సున్న సుమీ, పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకని ఆరు దశాబ్దాల క్రితమే మహకవి శ్రీనాథుడు అన్నారని ఆయన చెప్పారు.
విష్ణు కుండినుల మొదలు కాకతీయులు, ఆ తదుపరి నిజాంల వరకు అందరూ గొలుసు కట్టు చెరువుల నిర్మాణంతో వ్యవసాయ వృద్ధి కోసం బాటలు వేశారని ఆయన వెల్లడించారు. 11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణలో పండిన వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలకు ప్రసిద్ధి ఆయన చెప్పారు.
15వ శతాబ్ధం నుంచి హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి చెందిందన్నారు. బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ అని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ పలు మార్లు ప్రస్తావించారన్నారు. అక్కసు, అక్రోశం, విద్వేషం, వివక్ష, అన్యాయాలు తెలంగాణ ఉద్యమానికి పునాది పడిందన్నారు.
ఆ చెరువులు, కుంటలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. అప్పటికే ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారంటూ ఆయన ఫైర్ అయ్యారు. దశాబ్ధాలపాటు ప్రాజెక్టుల నిర్మాణాలను సాగదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు కట్టిన ఒక్క ప్రాజెక్టు కూడా మళ్లీ తెలంగాణ ఏర్పాటు వరకు నిర్ణీత లక్ష్యానికి సాగు నీరందించిన దాఖలాలు లేవని ఆయన ఆరోపణలు గుప్పించారు.