తెలంగాణలో వరి సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వరి సాగుపై ఎలాంటి ఆంక్షలు లేవని.. వానాకాలంలో ఏ పంట వేసుకోవాలనేది రైతుల ఇష్టమని స్పష్టం చేశారు. తెలంగాణలో పంటల మార్పడిలో భాగంగా ప్రభుత్వం వరి పంట వేయద్దని అంటున్నదే కానీ వరి పై ఆంక్షలు కాదని అన్నారు.
రైతన్న అన్నదాత మాత్రమే కాదు.. వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చే స్పూర్తి ప్రదాత కావాలన్నదే సీఎం కేసిఆర్ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. అలాగే, రైతు పంటతో మార్కెట్కు వెళ్లకుండా.. కల్లం వద్దకే మార్కెట్ రావాలన్నది కేసీఆర్ ఆలోచన అని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కురచబుద్దితో తెలంగాణ విజయాలను మరుగున పడేయాలని.. రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
రైతులు లాభసాటి పంటలు వేయాలనేదే తమ ఉద్దేశంగా చెప్పారు. కొందరు రైతులు అర్థం చేసుకుని ప్రత్యామ్నాయ పంటల సాగు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. వరి సాగుతో పోలిస్తే తక్కువ శ్రమ, పెట్టుబడి, పంట కాలంలో రైతులకు ఎక్కువ లాభం కళ్ల ముందు కనిపిస్తుందని అన్నారు. మంచి లాభదాయకంగా ఉన్న పత్తి, కంది, పెసలు, మినుముల పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
యాసంగిలో తెలంగాణ నుండి వచ్చే వడ్లు కొనం అని కేంద్రం స్పష్టంగా చెబుతున్నది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. వానాకాలం ఎవరి ఇష్టం వారిదని, ఈ విషయంలో ఆంక్షలు లేవని మంత్రి తెలిపారు. అలాగే, రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఇప్పటికైనా మార్చుకోవాలని హితవు పలికారు.