తెలంగాణ ఉద్యమం రాకముందు సిద్ధిపేట, దుబ్బాక ప్రాంతాల్లో చుక్కనీరు కూడా దొరికేది కాదని గుర్తుచేశారు తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చుక్కనీరు లేని ప్రాంతంలో సీఎం కేసీఆర్ సముద్రాన్ని సృష్టించారని పేర్కొన్నారు. 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి.. ఇంటింటికి నీటిని అందిస్తున్నారని అన్నారు.
ఒకప్పుడు మంచినీళ్లు కూడా లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. దుబ్బాకలో గతంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా ఇక్కడి ప్రజలు చూడాలన్నారు.
ఎన్నికష్టాలు వచ్చినా రైతు బంధు ఆపలేదని గుర్తుచేశారు మంత్రి. 10 విడతల్లో ఇప్పటికే 42 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చామని చెప్పారు. కోటి 50 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇస్తున్నామన్నారు. ప్రజలంతా సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
18 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి ఎక్కడైనా ఒక్క ప్రాజెక్ట్ కట్టారా? అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు ప్రాజెక్టులు కట్టరని.. తాము కడితే ఏడుస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో 90 స్థానాలు గెలుస్తామని చెబుతున్న బీజేపీ.. ముందుగా 90 మంది అభ్యర్థులను పెట్టుకోవాలని సూచించారు మంత్రి నిరంజన్ రెడ్డి.