రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే వరకు ప్రజాస్వామ్యయుతంగా పోరాడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ధాన్యం కొనుగోలు విషయంలో వాస్తవాలకు విరుద్ధంగా కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఢిల్లీలో కేంద్రంతో చర్చలు జరిపేందుకు మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రులతో చర్చలు జరపనుంది. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన బియ్యాన్ని తీసుకెళ్లకుండా.. ఆరోపణలు చేయడం కేంద్రమంత్రి పీయూష్ కు తగదని అన్నారు.
గత రెండు నెలల నుంచి పది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించడానికి తాము రెడీగా ఉంచామని పేర్కొన్నారు. పట్టిచ్చిన బియ్యం తమ దగ్గర ఎందుకు పెట్టుకుంటామని ప్రశ్నించారు. కేంద్రం తీసుకోకుండా తమపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. పంజాబ్ లో మద్దతు ధరకు వరి ధాన్యం కొన్నట్టు.. తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ మాట్లాడిన మాటలు అర్ధరహితమన్నారు.
వరి ధాన్యం కొనుగోలుపై ఏమైనా మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడాలని.. లేదంటే సంబంధిత అధికారులు మాట్లాడాలి గానీ బండి సంజయ్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి.