అన్నదాత ఆకలి చావులు ఏ నాయకునికి కనబడవు. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంట అకాల వర్షాలతో నేల రాలిపోతుంటే.. రైతు గుండె ఎందుకు ఆగదు. ఎన్ని గుండెలాగినా పాలకులకు గోరంతైనా కనికరం లేదు. ఏదో మొక్కుబడికి రాలేదనకుండా చుట్టం చూపుకు వచ్చినట్టు వచ్చి పోటోలకు ఫోజులివ్వడం తప్ప రైతుల కోసం చేసిందేం లేదు. అయితే.. మంగళవారం తెలంగాణ మంత్రుల బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించింది. పంట నష్టపోయిన రైతుల వద్దకు వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన మిరప రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. నష్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముందు అన్నదాతలు గోడు వెల్లబోసుకున్నారు. నేలరాలిన మిరప కాయలను దోసిళ్లతో చూపించారు. చేతికొచ్చిన పంట నేలపాలైందని కన్నీళ్లు పెట్టుకున్నారు.
తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మహిళా రైతులు మంత్రి నిరంజన్ రెడ్డి కాళ్లమీద పడి వేడుకున్నారు. లేదంటే తమకు చావే దిక్కవతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లాలోని పరకాల మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పరకాల మండలం నాగారంలో పంటలను పరిశీలించి.. నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అయితే.. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నట్టు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రకటించారు. పంట నష్టాన్ని స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. కానీ.. చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దవగా.. సీఎం ఆదేశాలతో మంత్రి నిరంజన్‌రెడ్డి వరంగల్ జిల్లాకు వెళ్లారు. ఎవరూ అధైర్య పడొద్దని.. అందరికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. రైతెలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అకాలవర్షాలతో కొన్ని ప్రాంతాలలో పంటలు దెబ్బతిన్న మాట వాస్తవమే.. నోటికొచ్చిన మిర్చి నేలరాలింది. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథనిలో మిర్చి దెబ్బతింది. నష్టపోయిన రైతుల పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరిస్తారు. రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అని నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. గత పాలకుల అసమద్దత విధానాల మూలంగా రైతులకు న్యాయం జరగలేదన్నారు.కేసీఆర్ సర్కార్ రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. రైతుల శ్రేయస్సు ఆలోచించి ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే అమలవుతున్నాయని.. ఎనిమిదో విడతతో రూ.50 వేల కోట్ల రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో చేరాయన్నారు నిరంజన్ రెడ్డి.