– చర్చనీయాంశంగా నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు
– కాళేశ్వరం లోపాల కవరేజ్ లో ప్రభుత్వం!
– మొన్నేమో తక్కువ ఖర్చే అవుతుందన్న రజత్ కుమార్
– ఇప్పుడు ప్రభుత్వ తప్పే లేదంటున్న నిరంజన్
– వరద అంచనా లేకుండా నిర్మాణాలు చేపట్టలేదా?
– ఇప్పుడు మునిగాక సర్కార్ తప్పు లేదంటారా?
– ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ప్రశ్నలు
భారీ వర్షాలతో ఆమధ్య గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ప్రతిష్టాత్మక కాళేశ్వరం పంప్ హౌస్ లు మునిగిపోయాయి. దీనికి కారణం.. నదులకు నడక నేర్పిన సీఎం కేసీఆర్, కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డేననే విమర్శలు వెల్లువెత్తాయి. పైగా అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు ఎవరినీ వెళ్లనివ్వలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వరదలకు మునిగిన మోటార్లు, పైపులు తాజాగా బయటపడ్డాయి. అయితే.. మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
వరదల వల్ల కాళేశ్వరం పంప్ హౌస్ లు మునిగిపోవడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలని తప్పుబట్టారు నిరంజన్ రెడ్డి. గతంలో చాలా సార్లు ఇటువంటి భారీ వరదలు వచ్చినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు మునిగిపోయాయని గుర్తు చేశారు. ‘‘నాగార్జునసాగర్ ప్రాజెక్టును నెహ్రూ కట్టారంటారు. శ్రీశైలం ప్రాజెక్టును నీలం సంజీవ రెడ్డి కట్టారంటారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును వైఎస్ఆర్ కట్టారంటారు.. మంచిగానే ఉంది మరి కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్ గురించి మాత్రం ఎందుకు మాట్లాడటం లేదు’’ అని మండిపడ్డారు.
నీటి లభ్యత ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కడుతుంటే ఆటంకాలు కలిగించడం ఎంత వరకు సమంజసం అంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకు లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రాజెక్టుపై 180 కేసులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతోందా? అంటూ ఫైరవుతున్నాయి. దేశానికే ఆదర్శం అంటూ కాళేశ్వరాన్ని చూపించుకుని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తహతహలాడుతున్న కేసీఆర్.. ఇప్పుడు ప్రాజెక్ట్ మునిగిపోవడంతో ప్రకృతిపై నిందలు వేయడం ఏంటని మండిపడుతున్నాయి. గతంలో ఇంతకంటే భారీ వరదలు వచ్చాయని.. వాటిని అంచనా వేయకుండా ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టడం ముమ్మాటికీ ప్రభుత్వం, కాంట్రాక్టర్ తప్పేనని అంటున్నాయి.