ఈడీ అధికారులకు బెంగాల్ మంత్రి పార్ధా చటర్జీ సహాయకురాలు కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో మంత్రి పార్ధా, అర్పితలను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అర్పిత ముఖర్జీ ఇంట్లో రూ.21 కోట్ల నగదును ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తాన్ని మంత్రి పార్ధా తన ఇంట్లో ఓ గదిలో దాచాడని అర్పిత చెప్పారు. ఆ గదిలోకి కేవలం పార్దా అనుచరులు మాత్రమే వెళ్లేవారని చెప్పారు.
వారానికి ఓ సారి తన ఇంటికి మంత్రి వచ్చేవారని ఆమె పేర్కొంది. తన ఇంటితో పాటు మరో మహిళకు చెందిన ఇంటిని కూడా పార్ద బ్యాంక్ లాగా వాడుకున్నారని చెప్పింది. ఆ మరో మహిళ కూడా మంత్రికి సన్నిహితురాలని అర్పిత తెలిపింది.
గదిలో ఎంత సొమ్ము ఉన్నదనే విషయాన్ని మంత్రి తనకెప్పుడూ చెప్పలేదన్నారు. తనను మంత్రి పార్ధాకు ఓ బెంగాలీ నటుడు పరిచయం చేయించాడని పేర్కొంది. మంత్రితో తనకు 2016 నుంచి పరిచయం ఉన్నట్లు వెల్లడించింది.
కళాశాలల గుర్తింపు, బదిలీల కోసం లంచాల కింద ఇచ్చినదే ఆ డబ్బంతా అని చెప్పారు. ఆ డబ్బును మంత్రి ఎప్పుడూ స్వయంగా పట్టుకురాలేదని, అతని అనుచరులు మాత్రమే తెచ్చేవారని వివరించింది.
మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీతో పాటు అర్పిత ముఖర్జీకి ఇవాళ కోల్‌కతాలో ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి 48 గంటలకు ఓ సారి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వుంది. వచ్చే నెల 3 వరకు వారిద్దరూ ఈడీ కస్టడీలో ఉండనున్నారు.