ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏడు స్థానాలకు గాను ఆరు, ఒక చోట టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలిచారు. టీడీపీ గెలుపుపై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. గత ఎన్నికల్లో 23 సీట్లు గెలుచుకున్న తెలుగు దేశం పార్టీకి 2024 ఎన్నికల్లో కనీసం రెండు కూడా రావని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నాడని, కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి వారిలో 22 మంది ఓడిపోయారని గుర్తు చేశారు.
ఇప్పుడు కూడా డబ్బుకు అమ్ముడుపోయిన వారికి 2024 అదే గతి పడుతుందని ధ్వజమెత్తారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే… జగన్ ను ఎవరు వ్యతిరేకిస్తే వారికే నష్టమన్నారు. జగన్ కు వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు. జగన్ చరిష్మాతో ఎమ్మెల్యేలుగా గెలిచిన వీరు, అమ్ముడుపోయారన్నారు. చంద్రబాబు ఇప్పటికీ వైస్రాయ్ తరహా రాజకీయాలను కొనసాగించడం సిగ్గుచేటు అన్నారు. ఆయనను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు.
ఎన్టీఆర్, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. దీనికి కొనసాగింపుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇద్దరిని కొన్నందుకు వచ్చేసారి ఆ రెండు ఎమ్మెల్యేలు కూడా గెలవరని జోస్యం చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేల భవిష్యత్తు మున్ముందు తెలుస్తుందన్నారు. వచ్చేసారి గెలవని వారు, సీట్లు రాని వారు అలా చేశారని, కాబట్టి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిని గుర్తించినట్లు చెప్పారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… చంద్రబాబు నీచ రాజకీయాలకు నమ్మి వెళ్లిన నలుగురికి భవిష్యత్తు లేదన్నారు. గతంలో చంద్రబాబును నమ్మి వెళ్లిన 23 మంది పరిస్థితి ఏమయిందని, వచ్చేసారి కూడా అలాగే అవుతుందన్నారు. తాము 175 సీట్లు గెలవడం ఖాయమన్నారు. ఇది ప్రజలతో సంబంధం లేని ఎన్నిక అని, టీడీపీ చెబుతున్నట్లుగా ప్రజాస్వామ్య విజయం కాదని మల్లాది విష్ణు అన్నారు. తమతోనే ఉంటూ వెన్నుపోటు పొడిచిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. చంద్రబాబు మొదటి నుండి కుట్రలు, కుతంత్రాలు చేయడం అలవాటే అన్నారు.