గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ఊహించని స్థాయిలో పెట్టుబడులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏపీ మంత్రి రోజా. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎమ్ వోయూలు జరిగాయని తెలిపారు. పర్యాటక రంగంలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి అని రోజా ఆనందం వ్యక్తం చేశారు.
వంద శాతం ప్రతిపాదనలన్నీ గ్రౌండ్ అవుతాయని చెప్పారు. జగన్ అంటే ఒక బ్రాండ్ అని, జగన్ అంటే ఒక జోష్ అని కొనియాడారు. సీఎం జగన్ పై ఉన్న నమ్మకంతోనే రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని వెల్లడించారు మంత్రి రోజా.
అంతకుముందు రోజా మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కరోనా కారణంగా పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా నామ మాత్ర ఒప్పందాలు కాదని, అన్ని ఒప్పందాలను క్షేత్రస్థాయిలో పెట్టుబడుల వరకు తీసుకు వెళ్తామని రోజా చెప్పారు.
ఓబురాయి హోటల్స్ యాజమాన్యం తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, విశాఖలో సరికొత్త హోటల్స్ ఏర్పాటు చేయనున్నాయని తెలిపారు. తిరుపతి టెంపుల్ టూరిజంగా, వైజాగ్ ప్రకృతి టూరిజంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. విశాఖలో సమ్మిట్ తర్వాత అన్ని దేశాలు ఏపీ వైపు చూస్తాయని మంత్రి రోజా ఆశాభావం వ్యక్తం చేశారు.