మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలు ఏపీలో ఘనంగా జరిగాయి. ప్రధాని మోడీ భీమవరంలో జరిగిన సభకు హాజరై.. వర్చువల్ గా 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లూరి తెలుగు జాతి యుగపురుషుడు అని కొనియాడారు ప్రధాని.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు మంత్రి రోజా. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి 125వ జయంతోత్సవాలు జరిగాయి. సభా వేదికపై కేవలం 11 మందికే అవకాశం లభించింది. వారిలో రోజా కూడా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆమే. సభ ప్రారంభం నుంచి రోజా ఎంతో సంతోషంగా కనిపించారు.
అయితే.. ప్రధాని ప్రసంగం అయిపోయిన వెంటనే అందరూ కలిసి గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డారు. ఆ తర్వాత ఒక్క సెల్ఫీ సార్ అంటూ మోడీని రిక్వెస్ట్ చేశారు రోజా. దానికి సరేనని మోడీ నవ్వుతూ నిలుచుకున్నారు. అదే సమయంలో వారి వెనుక జగన్, చిరంజీవి మాట్లాడుతుండగా.. జగన్ ను కూడా పిలిచారు.
అంతకుముందు ఫోటో సరిగ్గా రాలేదో ఏమోగానీ.. మరొకటి సార్ అని రోజా రిక్వెస్ట్ చేయగానే సరేనని అన్నారు మోడీ. ఇంకో సెల్ఫీ తీసుకున్నారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవితోనూ స్పెషల్ సెల్ఫీ దిగారు రోజా. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.