టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. వీటి కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాగా, హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్ లోని గోల్డెన్ జూబ్లీ హాల్ లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ రోజు ఉదయం 9.30 గంటలకు రిజల్ట్స్ విడుదల చేశారు.
ఇక ఇంజనీరింగ్ విభాగంలో 80 శాతం, అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో 86 శాతం మంది అర్హత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. అయితే కౌన్సిలింగ్ కోసం త్వరలోనే తేదీలను ప్రకటిస్తామన్నారు సబితాఇంద్రారెడ్డి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు సంబంధించిన పలు కోర్సుల్లో ఈ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్లు కల్పించడం జరుగుతుంది.
ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా.. వీటిలో 3,01,789 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. ఇక వీరిలో నుంచి తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా, 2,35,918 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
ఏపీ నుంచి 72,204 మంది స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోగా, 65,871 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఇక విద్యార్థులు ఎంసెట్ ఫలితాల కోసం eamcet.tsche.ac.in వెబ్ సైట్ సంప్రదించవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.