– కొంగర్ ఖుర్ద్ కబ్జాలపై మంత్రి సీరియస్
– ఏం జరుగుతుందో రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్
– ఓఆర్సీలు అంటూ రియల్ ఎస్టేట్
– భూ స్కాంపై తొలివెలుగు కథనాలు
– సొంత నియోజకవర్గం కావడంతో కుమారుడిపై ఆరోపణలు
– అసద్ అనుచరులు ఉన్నారంటున్న రైతులు
– తప్పెవరిదో తేలితే.. శిక్ష ఉంటుందా..?
క్రైంబ్యూరో, తొలివెలుగు:భూకబ్జాలపై తొలివెలుగులో వస్తున్న కథనాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రియాక్ట్ అయ్యారు. రంగారెడ్డి కలెక్టర్ కు రాచకొండ పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దశాబ్దాల కాలంగా రైతులకు, వక్ఫ్ బోర్డు మధ్య జరుగుతున్న వివాదంలో రియల్టర్స్ ఎంట్రీ ఇవ్వడం లే-అవుట్స్ వేయడంతో భారీ భూ స్కాం తెరపైకి వచ్చింది. దొంగ ఓనర్ షిప్స్ తో కోర్టులను తప్పుదోవ పట్టించి ఎలా కబ్జాలకు పాల్పడుతున్నారో ఆధారాలతో సహా తొలివెలుగు ప్రచురించింది.
సందట్లో సడేమియా.. చాలా మందే..!
తొలివెలుగు పక్కా ఆధారాలు ఉంటేనే వార్తలను ప్రచురిస్తుంది. 58 ఎకరాల్లో కోర్టులకు ఎక్స్ పార్టీ తీర్పులను తీసుకొచ్చి ఎలా దాడులకు పాల్పడ్డారో వారి వెనుక ఎవరున్నారని ఆరోపించారో ఫోటోలతో సహా వార్తలు ఇచ్చింది. అయితే.. ఇదే అదునుగా కొంతమంది సోషల్ మీడియా రిపోర్టర్స్ అంటూ వివిధ పేర్లు చెప్పి.. రైతుల వద్దకు వెళ్లి రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. దాంతో ఆగకుండా కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్న రియల్టర్స్ కి డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం దీనిపై ఆదిభట్ల పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. మత విద్వేషాలు రెచ్చగొట్టడం.. వివాదాస్పద భూమిలోకి వెళ్లి దాడులు చేయడంపై కేసులు నమోదయినట్లు వినికిడి.
ఇంత వివాదం జరిగినా కూడా సీఆర్పీసీ 145 అమలు చేయరేం..?
నిత్యం వివాదాలతో గొడవలు జరిగితే పోలీసులు సీఆర్పీసీ 145 అమలు చేయాల్సిందిగా ఆర్డీవో కి లేదా కలెక్టర్ కి రిఫర్ చేస్తారు. కానీ, ఇక్కడ అలాంటిది కనిపించడం లేదు. గతంలో రాజకీయ నాయకుల భూములకు ప్లాట్ ఓనర్స్ కి గొడవలు జరిగితే ఇదే రాచకొండ పోలీసులు.. ఈ సెక్షన్ ను ఎన్నోసార్లు అమలు చేశారు. కానీ, ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
ఎవరి అనుచరులో తేలుస్తారా..?
మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం కావడంతో ఈ కబ్జా వ్యవహారం మరింత హీటెక్కింది. వక్ఫ్ బోర్డు భూములకు అంత ఈజీగా హెచ్ఎండీఏ.. ఎలా లే-అవుట్ అనుమతులు ఇచ్చేంత వరకు వెళ్లిందని అనుమనాలు వక్త్యం అవుతున్నాయి. మంత్రి కుమారుడు కార్తీక్ రెడ్డి స్నేహితులు, అనుచరులు, బంధువులు ఈ భూములు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఇప్పుడు నిగ్గు తేలుస్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఎన్ క్యూబ్ వెంచర్స్ ఎవరిది? అసలు ఆ ఓఆర్సీలు నిజమైనవేనా? ఇలా ఎన్ని ఓనర్ షిప్ సర్టిఫికెట్స్ ఇచ్చారు? 2010లో ల్యాండ్ కన్వర్షన్ చేసుకున్నామని చెబుతున్న రియల్టర్స్ ఇప్పుడెందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు? 2019 నుంచే కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో తేల్చాల్సిన అవసరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ పై ఉంది.
58 కాదు.. మరో 37 ఎకరాలు ఉంది!
వివాదం మొత్తం 58 ఎకరాలే అనుకుంటే పొరపాటే. సర్వే నెంబర్ 82లో 6 ఎకరాలు, 83లో 3 ఎకరాలు, 264లో 8 ఎకరాలు, 284లో 19 ఎకరాల 31 గుంటల భూమిపై నకిలీ ఓఆర్సీల వివాదం ఉంది. సర్వే నెంబర్ 82లో 6 ఎకరాలపై ఇటీవల హైకోర్టు(రిట్ నెంబర్ 3636/2022)లే-అవుట్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ భూమిపై ఎలక లత అనే మహిళ పేరు మీద రెండు ఓఆర్సీలు ఇచ్చారు. ప్రైవేట్ అగ్రిమెంట్ తోనే మహేశ్వరం కోర్టు(ఓఎస్ నెంబర్ 91/2020) ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఎమ్మారో జ్యోతి పట్టా పాస్ బుక్ లు రద్దు చేసిన తర్వాత ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం.. ఆ తర్వాత హైకోర్టులో ఇరు పార్టీలు రిట్ పిటిషన్స్ దాఖలు చేసుకోవడంతో చివరికి లే-అవుట్ రద్దు చేస్తూ తీర్పు వచ్చింది.
ఆనాటి చర్యలు ఇప్పుడేవి?
90 ఏళ్లుగా వక్ఫ్ భూములు అంటూ సాగుతున్న వ్యవహారంలో ఎంతోమంది దొంగ ఓఆర్సీలు సృష్టించారు. అధికారులతో కలిసి భూములను కొట్టేయాలని ప్రయత్నించారు. 2011లో 10 మందిపై కేసు(సిసి నెంబర్ 424/11) నమోదైంది. ఈ భూములపై ఫాం 10 ప్రకారం ఓఆర్సీ తీసుకున్నారు. ఇదంతా కుమ్మక్కై దొంగ ఓఆర్సీ తీసుకున్నారని 10 మందికి రంగారెడ్డి కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అందులో ఏ శంకరయ్య , ఏ సత్యనారాయణ, విజయ్ కుమార్, హేమలత(పంచాయతీ ఉద్యోగిని), మోహన్ రెడ్డి, యాదగిరిరెడ్డి, ఇబ్రహిం, గణేష్ తో పాటు.. రెవెన్యూ ఉద్యోగులు వెంకటయ్య, మహమ్మద్ అలీలు ఉన్నారు. ఈ శిక్షల తర్వాత దొంగ పత్రాలు చేయించుకున్న వారు సైలెంట్ అయ్యారు. మళ్లీ 2019 తర్వాత కోర్టులో తప్పుడు సమాచారంతో తీర్పులు తెచ్చుకుని అటు పోలీసులను తప్పుదారి పట్టించి పొజిషన్ తీసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. వీటన్నింటిపై ఇప్పుడు కలెక్టర్ చర్యలు తీసుకుంటారా? నిజానికి ఎన్ని ఓఆర్సీలు ఇచ్చారు? 60 ఎండ్లుగా ఎందుకు ఈ విషయాన్ని స్పష్టం చేయకుండా.. టైటిల్ ని తేల్చకుండా నాన్చుతున్నారు? ఇవన్నీ ఇప్పుడైనా బయటకు వస్తాయా అనేది చూడాలి.