సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులే టార్గెట్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో విమర్శలు చేస్తున్నారు. తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడతదంట.. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటదంట. ఏమి లేని ఆకు లాగా బీజేపీ తీరు ఉందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు సబితా. రాష్ట్రంలో అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకంను.. దమ్ముంటే మోడీకి చెప్పి దేశమంతా ఇప్పించాలని ధ్వజమెత్తారు.
అధికారమిస్తే ఉచిత విద్య, వైద్యం అంటున్నారు.. కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వమని మర్చిపోయారా అని సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. వెంటనే దేశమంతా ఉచిత విద్య, వైద్యం ఇవ్వండి అని ఆమె సవాల్ విసిరారు. ఏమి చేతకాని వీళ్ళు మహేశ్వరంలో పాదయాత్ర చేస్తారంట అని ఎద్దేవా చేశారు.
తామేసిన రోడ్లు చూసుకుంటూ.. 24 గంటలు వెలుగుతున్న లైట్లు చూసుకుంటా పాదయాత్ర చేయండంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇంటింటికి వెళ్లి అమ్మలను అడగండి నీళ్లు ఎట్లా వస్తున్నాయని, చెరువు కట్ట దగ్గర నుంచి రండి అందులో చేపలు ఎలా తిరుగుతున్నాయో కనిపిస్తాయని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.