రెండేళ్ల కరోనా సంక్షోభం తర్వాత నూతన విద్యా సంవత్సరం ఆరంభమవుతోంది. రేపటి నుంచే తెలంగాణ రాష్ట్రంలో బడులు తెరుచుకోనున్నాయి. మరోవైపు ఆంగ్ల మాద్యమం కోసం అధికారులు సన్నాహాలు చేశారు. కరోనా వ్యాప్తితో మూతపడిన పాఠశాలలను పున:ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖలోని అని విభాగాలకు ఆమె ఆదేశాలను జారీ చేశారు.
తెలంగాణలో సోమవారం నుంచి బడులు రీఓపెన్ కానున్నాయి. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో క్లాసులు నిర్వహిస్తామన్నారు. ప్రత్యక్ష క్లాసుల ద్వారానే విద్యార్థులకు సబ్జెక్స్ అర్థమవుతాయని.. బ్రిడ్జీ క్లాసెస్ కండక్ట్ చేయాలని తాము టీచర్లకు సూచించడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే కోటి 64 లక్షల పుస్తకాలు ప్రింటింగ్ పూర్తయిందని తెలిపారు. ఉచితంగా యూనిఫాం, భోజనం అందిస్తామన్నారు. రెండేళ్ల తర్వాత స్కూళ్లు పకడ్బందీగా ఓపెన్ అవుతుండటంతో ప్రజాప్రతినిధులు ఒక వేడుకగా నిర్వహించాలని, స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.
70 వేల మంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరినట్లు, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేరిపించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని తెలిపారు. పిల్లలకు ఇబ్బంది లేకుండా మన ఊరు మన బడి కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే సుమారు 26 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకోసం సుమారు 3.5 కోట్ల పుస్తకాలను ముద్రించాలి. ఇవి విద్యార్థుల చేతుల్లోకి రావడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక, యూనిఫాంలకు అవసరం అయ్యే వస్త్రాన్ని ఇంకా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు. మరోవైపు ప్రైవేట్ స్కూళ్లల్లో, మైనార్టీ విద్యాసంస్థల్లో ఫీజుల పెంపును నియంత్రించాలంటూ విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఓవైపు ఇంకా మండుతున్న ఎండలు.. మరోవైపు ఉపాధ్యాయుల కొరత, ఇంతవరకు సిద్ధంకాని పాఠ్యపుస్తకాలతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేట్లు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.