ఇంటర్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షలపై ఆయా జిల్లా కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి సబిత మాట్లాడుతూ.. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఎండలు ఎక్కువగా ఉన్నాయని, అందుకు తగ్గట్టుగానే పరీక్షా కేంద్రాల్లో మంచినీళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు, భద్రతపై దృష్టి సారించాలని చెప్పారు.
పరీక్షా సమయం కంటే ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు మంత్రి. దీని వల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 45 వేల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కు హాజరవుతున్నారని ఆమె వెల్లడించారు.
హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. ఆయా పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రాంతాలకు.. ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, ఈ వసతులను విద్యార్థులు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.