టీఆర్ఎస్‌లో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీలో గ్రూపుల గొడవలు మంత్రి పర్యటన సందర్భంగా బయపటపడ్డాయి. ఓకే పార్టీలో ఉన్నా, అధికారిక కార్యక్రమం అయినా… టీఆర్ఎస్ నేతల ప్రవర్తనపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేకుండా… అందరినీ చేర్చుకున్న గులాబీదళంలో ఇప్పుడు వర్గబేధాలు ముదిరిపాకాన పడుతున్నాయి. వ్యక్తిగత విభేదాలు పక్కనపెడతాం, పార్టీ కోసం… కేసీఆర్ నాయకత్వంలో సమిష్టిగా పనిచేస్తాం అని చెప్పుకునే నేతలు నియోజకవర్గాల్లో మాత్రం గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు.
తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి- పట్నం బ్రదర్స్ మధ్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మంత్రి హోదాలో సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇలాకా తాండూరులో పర్యటిస్తున్నా… పట్నం సోదరులు, ఆయన అనుచరులు ఎవరూ మంత్రి పర్యటనలో పాల్గొనలేదు. తాండూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుండి గెలిచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన పైలెట్ రోహిత్ రెడ్డి అంతా తానే అయి మంత్రి పర్యటనలో వ్యవహరం చక్కపెట్టారు.
అయితే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి పట్నం బ్రదర్స్ బంధువులే కానీ… శత్రువులు. ఎన్నో ఏళ్లుగా వీరి కుటుంబాల మధ్య సఖ్యత లేదన్న ప్రచారం ఉంది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో… ఇద్దరు ఓకే పార్టీలో ఉన్నారు. కానీ అనూహ్యంగా సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి దక్కటంతో… పట్నం బ్రదర్స్ అసంతృప్తిలో ఉన్నట్లు రంగారెడ్డి రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మంత్రి హజరైన ఏ కార్యక్రమానికి కూడా పట్నం సోదరులు కానీ, జెడ్పీ చైర్మన్‌గా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి సతీమణి కానీ హజరుకాకపోవటం చర్చనీయాంశం అవుతోంది. భవిష్యత్‌లో ఈ విభేదాలు పార్టీపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయంటున్నారు స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు.