ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగనుంది. ఇటు తెలంగాణ నుంచే కాకుండా అటు ఏపీ నుంచి భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు గులాబీ నేతలు. జిల్లాల్లో మీటింగులు ఏర్పాటు చేసి.. నేతలను సమాయత్తం చేస్తున్నారు. జాతీయ రాజకీయాలకు ఈ సభ నుంచే కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అగ్ర నేతలు జనసమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు మంత్రి సత్యవతి రాథోడ్. లక్ష 20వేల మందిని సభ కోసం తరలించాలని చెప్పారు. అయితే.. మీటింగ్ విషయాలను వివరించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి.
ప్రెస్ మీట్ లో మంత్రితోపాటు.. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నూకల నరేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. అయితే.. మంత్రి మాట్లాడుతున్న సమయంలో సొంత పార్టీకి చెందిన యాకూబ్ రెడ్డి అడ్డుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన తమకు అవకాశాలు కల్పించకుండా నిన్న మొన్న పార్టీలో చేరిన వారిని స్టేజ్ పై కూర్చోబెట్టడంపై అభ్యంతరం తెలిపారు.
గౌరవ ఆహ్వానాలు, ఉన్నత పదవులు, రాచ మర్యాదలు అన్నీ మధ్యలో వచ్చినవారికేనా అని ప్రశ్నించారు యాకూబ్ రెడ్డి. ఈ అనూహ్య ఘటనతో మంత్రి షాకయ్యారు. ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.