ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలో ప్రతి సోమవారం జిల్లాల స్థాయిలో కలెక్టర్లు, కింది స్థాయిలో ఆర్డీఓలు, తహసిల్దార్లు ప్రజావాణి నిర్వహిస్తుంటారు. వీలైనంత మేరకు వారి సమస్యలను విని.. పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే కొన్ని సమస్యలు ఎప్పుడు పరిష్కారమయ్యేది స్పష్టత లేకుండాపోయేది. మరోవైపు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొనడం కానీ, వారి పాత్ర కానీ ఉండేది కాదు. అయితే తొలిసారిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సరిగ్గా ఇదే తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా వేదిక పేరుతో ప్రజల ఫిర్యాదులను స్వీకరించి.. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఏదైనా ప్రభుత్వ శాఖలో పనులు జరగకపోయినా.. లేదా ఏదైనా అన్యాయం జరిగినా నేరుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తమ సమస్యలను ఏకరవు పెట్టుకోవచ్చు. స్వయంగా లేదా ఆన్ లైన్ కూడా తమ సమస్యను చెప్పుకోవచ్చు. అయితే కేవలం రెండు రోజుల్లో వారి సమస్యకు పరిష్కారం లభించేలా మంత్రి పూర్తి బాధ్యత తీసుకుంటారు.
నూతనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి గురువారం రోజున మంత్రి శ్రీనివాస్ గౌడ్..సామాన్యులకు అందుబాటులో ఉంటారు. కాగా ఇప్పటికే ఓ దఫా ప్రజావేదిక నిర్వహించగా.. ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. సమస్య తీవ్రతను బట్టి నిర్ణీత సమయంలో ఫిర్యాదుదారుల సమస్యను తీరే విధంగా అధికారులకు దిశా నిర్ధేశం చేశారు మంత్రి. ఇదిలా ఉంటే ప్రజావేదికతో మంత్రి త్వరగా సమస్యలకు పరిష్కారం చూపుతారా లేక.. ప్రజావాణితో అధికారులు వేగంగా స్పందిస్తారా అన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.