– మంటగలిసిన రవీంద్రభారతి సంప్రదాయం
– మంత్రిగారి అనుచరుల వికృత కళా విన్యాసం
– మంత్రి శ్రీనివాస్ గౌడ్ విందులో మాంసాహారం
– మహా మహా విద్వాంసులు నడిచిన చోట…!
– మంత్రిగారి ఛాంబరే వంటగది
రవీంద్రభారతి… కొన్ని దశాబ్ధాలుగా హైదరాబాద్ నడిబొడ్డున కొలువైన గొప్ప సాంస్కృతిక కేంద్రం. ఇప్పటి ఎందరో మహా మహా కళాకారులు అరంగేట్రం చేసిన సరస్వతీ నిలయం. విశ్వకవి రవీంద్రుడి పేరుతో వెలిసిన మహోన్నత సాంస్కృతిక కేంద్రం. కళల కాణాచి, చదువుల తల్లి ఒడిని ఓ టీఆర్ఎస్ మంత్రి అపహాస్యం పాలు చేశారు. తరతరాల సంప్రదాయాన్ని బుట్టదాఖలు చేస్తూ… రవీంద్రభారతి ప్రాంగణంలోనే చికెన్, మటన్, ఫిష్..ఇలా మాంసాహారం భక్షించటంలో తమ వికృత కళలన్నీ ప్రదర్శించారు.
అప్పట్లో కేసీఆర్ గారు తెలంగాణ రూపు రేఖలు మారుస్తామంటే అంతా ఏంటో అనుకున్నారు. రవీంద్రభారతిలో దశబ్ధాల తరబడి కొనసాగుతున్న ఓ అలవాటుకు ఎక్సైజ్ మంత్రి శ్రీనివాసగౌడ్, ఆయన శాఖ అధికారులు సక్సెెస్ ఫుల్ గా స్వస్తి పలికారు.
రవీంద్రభారతి చరిత్రలోనే మొట్టమొదటి సారి నాన్ వెజ్ (మాంసాహారం) వంటకాలతో వారంతా విందు చేసుకున్నారు. మటన్, చికెన్, ఫిష్ బిర్యానీలతో హల్చల్ చేశారు. ఇందు కోసం ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఛాంబర్నే వంటగదిగా మార్చేశారు ఎక్సైజ్ పోలీసులు. సాంస్కృతిక శాఖ కార్యాలయంలో మాంసాహారాలతో కూడిన వంటలు చేయించారు. రవీంద్రభారతి ప్రాంగణంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమం కోసం ఇలా ఓన్లీ వెజ్ సాంప్రదాయానికి టాటా చెప్పేశారు. రవీంద్రభారతిలో నాన్వెజ్ వంటలేంటి అని ఎవరెందుకు అడుగుతారు…. తన ఛాంబర్లోనే తినండి అని మంత్రిగారే తాళాలు ఇచ్చేశాక కూడా!