మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో నిందితులకు ఊరట లభించింది. మేడ్చల్ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. మొత్తం ఏడుగురికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేశారని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువుర్ని పోలీసులు కొద్దిరోజుల క్రితం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనేక అనుమానాలు తెరపైకి వచ్చినా.. పోలీసులు చేయాల్సిన పని చేసేశారు. ఈ నేపథ్యంలో నిందితులు రెండుసార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
మొదటిసారి వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. రెండోసారి వేసిన పిటిషన్ పై మార్చి 15న విచారణ జరిగింది. నిందితులకు బెయిల్ ఇస్తే సాంకేతిక ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని బెయిల్ ఇవ్వకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరు వర్గాల వాదనల తర్వాత తీర్పును 31కి వాయిదా వేసింది కోర్టు. ఈ నేపథ్యంలో తీర్పును వెలువరించింది న్యాయస్థానం.
నిందితులు రాఘవేంద్రరాజు, నాగరాజు, అమరేందర్ రాజు, యాదయ్య, విశ్వనాథ్, మధు, మున్నూరు రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది కోర్టు. రూ.40 వేలు పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే వారానికి 2 రోజులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో సంతకాల కోసం హాజరవ్వాలని ఆదేశించింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ కు సంబంధించి పిటిషన్ వేసిన రాఘవేంద్రరాజు.. ఆయన్నే హతమార్చేందుకు ప్లాన్ చేశాడని ఈ కేసు నమోదైంది. ఇది కక్ష సాధింపు చర్యగా జరిగిందని నిందితుల కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.