సంక్షేమ పథకాల అమలుపై టీఆర్ఎస్ సర్కార్ మోసపూరిత వైఖరి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ప్రజలను నమ్మించలేక అధికార పార్టీ లీడర్లు ఒక్కొక్కరుగా సరెండర్ అవుతున్నారు. ఏడాది పాటు సంక్షేమ పథకాలు ఆపేస్తే.. టీఆర్ఎస్ పార్టీ విలువ తెలుస్తుందని నిన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను మరువకముందే.. తాజాగా మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మరో ఆణిముత్యాన్ని జనం చెవిన వేశారు.
అర్హులైనా సరే.. అడిగిన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టివ్వలేమని కుండబద్దలు కొట్టారు శ్రీనివాసగౌడ్. ప్రభుత్వం ఏదో మూడో, నాలుగో వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించగలదు కానీ.. అందరికీ బెడ్ రూం ఇళ్లు కట్టివ్వడం ఎప్పటికీ సాధ్యం కాదని అసలు నిజాన్ని బయటపెట్టారు. ప్రభుత్వం నిర్మించే ఇళ్ల లబ్ధిదారుల్లో తమ పేరు ఉండాలని దేవుడిని ప్రార్థించుకోవడం తప్ప మరో మార్గం లేదని లబ్ధిదారులకు ఉచిత సలహా కూడా ఇచ్చారు. పేదవాళ్లందరికీ ఇళ్లు కట్టి ఇవ్వాలంటే.. పదేళ్లు, పదిహేనేళ్లు కూడా పట్టవచ్చంటూ అసలు నిజాన్ని కక్కారు మంత్రి.