కేసీఆర్ జాతీయ పార్టీ నేపథ్యంలో గులాబీ శ్రేణుల ఉత్సాహం మామూలుగా లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని, కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఇక కాచుకోండి అంటూ సవాళ్లు విసిరారు. తెలంగాణ భవన దగ్గర మీడియాతో మాట్లాడిన కొందరు నేతలు ఏమన్నారో చూద్దాం…
మల్లారెడ్డి, మంత్రి
ఆనాడు కౌరవులపై పాండవులు విజయం సాధించారు.. ఇవాళ కూడా కౌరవుల లాంటి బీజేపీ నాయకులపై మా పార్టీ అధినేత కేసీఆర్ విజయం సాధిస్తారు అనే నమ్మకం ఉంది. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో కేసీఆర్ దేశ రాజకీయాల్లోనూ విజయం సాధించబోతున్నారు. అంతే కాదు.. సీఎం కేసీఆర్ భారత ప్రధాని కూడా అవుతారు.
తలసాని శ్రీనివాస్, మంత్రి
దేశ రాజకీయాలను కేసీఆర్ ప్రభావితం చేస్తారు. ఆయన విజనరీ నాయకుడు. రాష్ట్రం సాధించడమే కాకుండా.. తెలంగాణను నెంబర్ వన్ చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయి. కేంద్రం ఇప్పటివరకు అనేక అవార్డులు ఇచ్చింది. తెలంగాణ మాదిరిగానే భారతదేశాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ మోడల్ ను దేశమంతా అమలు చేస్తాం. ఇండియన్ సిటిజన్ గా దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాం.
శ్రీనివాస్ గౌడ్, మంత్రి
రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ పోటీచేసిన చోట కూడా మా పార్టీ పోటీ చేయబోతోంది. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ బయలుదేరినప్పుడు కూడా ఇవే సందేహాలు.. ఇవే అనుమానాలు.. తెలంగాణ వస్తదా.. తెలంగాణ ఎట్ల వస్తది.. ఎట్లిస్తరు.. తెలంగాణ మీ వల్ల అయితదా అని మాట్లాడారు. అయినా ఆ మాటలను లెక్క చేయకుండా కేసీఆర్.. టీడీపీ నుంచి ఒక్కడే బయటకు వచ్చారు. గుంపును జమచేసి తెలంగాణ తెచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ప్రజల మాదిరిగానే దేశ ప్రజలు బతకాలన్నదే మా నాయకుడి ఆలోచన.