తెలంగాణ ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పెద్దపల్లిలో ఓ రెస్టారెంట్ లోని లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ కు వెళ్తున్న మంత్రి..స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని కూనారం చౌరస్తాలో తన అనుచరుని రెస్టారెంట్ కు వెళ్లారు.
తిరిగి వచ్చేటప్పుడు లిఫ్ట్ ను ఆశ్రయించారు. సామర్థ్యం మించిపోవడంతో లిఫ్ట్ తలుపులు మూసుకున్నా..ఎటూ కదల్లేదు. పోలీసులు కాసేపు శ్రమించి తలుపులు తెరిచారు.
అనంతరం మంత్రి నవ్వుకుంటూ బయటకు వచ్చి లిఫ్ట్ లో సామర్థ్యానికి మించి జనం ఎక్కడంతోనే ఆగిపోయిందని, తాను క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ”పెద్దపల్లి గుర్తుండిపోతుంది”అంటూ నవ్వుకుంటూ చెన్నూరు పయనమయ్యారు.