రాష్ట్రంలో, నగరంలో ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకూడదని కేసీఆర్ నిర్ణయించారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. డబ్బులకు ఆశపడి కొన్ని చీడపురుగులు అసాంఘిక పనులు చేస్తున్నాయని ఫైరయ్యారు. వాటిపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గతంలోనే ముఖ్యమంత్రి ఆదేశించారని గుర్తు చేశారు. పేకాట, గుడుంబాని అరికట్టామని.. డ్రగ్స్ కట్టడిలోనూ అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ లో పబ్ యాజమానులతో మంత్రి సమావేశమయ్యారు. ఆబ్కారీ శాఖ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. పబ్‌ల్లో డ్రగ్స్ వ్యవహారం ఇప్పటిది కాదని.. ఈ దందాలో ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆఖరికి టీఆర్ఎస్ నేతలకు ప్రమేయం ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్రంలో డ్రగ్స్ దందా చేయాలనుకునే వాళ్ళు వేరే స్టేట్ కు వెళ్లిపోవాలని హెచ్చరించారు శ్రీనివాస్ గౌడ్. గతంలో సమావేశం పెట్టి హెచ్చరించినా పబ్స్ తీరు మారలేదని.. ఇలానే ఉంటే మొత్తం మూసివేయడానికి కూడా ప్రభుత్వం వెనకాడదని స్పష్టం చేశారు. డబ్బు కోసం ఇలాంటి వృత్తి చేసేవాళ్ళు కుటుంబాలను కూడా అమ్ముకునేందుకు తెగిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పబ్ లు టైమ్ దాటాక కూడా నడిపిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు మంత్రి. నగరంలో మొత్తం 61 పబ్స్ ఉన్నాయని.. వాటన్నింటిలో సీసీటీవీ కెమెరాలు తప్పకుండా ఉండాలని చెప్పారు. ఒకవేళ కెమెరాలు లేని పబ్స్ ఉంటే వాటిని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.