తలసాని శ్రీనివాస్, తెలంగాణ మంత్రి
ఫ్లెక్సీల విషయంలో మొదట వివాదం ప్రారంభించింది బీజేపీనే. కేసీఆర్ ను ఉద్దేశించి దుర్మార్గపు ప్రచారాన్ని మొదలుపెట్టారు. దాన్ని తిప్పికొట్టేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ టూరిస్టులంతా తెలంగాణ అభివృద్దిని చూడాలి. ఇక్కడ జరుగుతున్న డెవలప్ మెంట్ ను ఒక మోడల్ గా తీసుకుని ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలి.
మహారాష్ట్రలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. తెలంగాణలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని ప్రచారం చేస్తున్న బీజేపీకి ఉన్న బలం ఎంత. మోడీ గద్దెదిగిపోవాలని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కోరుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను చేతిలో పెట్టుకుని బెదిరించాలని ప్రయత్నిస్తే ఇక్కడ ఎవరూ భయపడరు.
దేశంలో ప్రజలు ముందస్తు ఎన్నికలు కావాలని కోరుకుంటున్నారు. దానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ప్రధానికి ప్రోటోకాల్ అవసరం లేదు. సీఎం అవసరం లేదు. ప్రధాని అనేక సార్లు హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం పలికారు.
బై బై మోడీ అనేది ఎప్పటినుంచో జరుగుతున్న అంశం. రాష్ట్రానికి వచ్చిన ప్రధానిని ఆహ్వానించడానికి ప్రతినిధిగా కేబినెట్ మినిస్టర్ ఉన్నా సరిపోతుంది. భారత్ బయోటెక్ కు మోడీ వచ్చిన సందర్భంలో ప్రోటోకాల్ అవసరం లేదా? కార్యవర్గ సమావేశాలు ఉన్నాయనే నెపంతో గత వారం రోజులుగా రాష్ట్ర నేతలతో పాటు ఆయా రాష్ట్రాల నుండి వచ్చిన బీజేపీ నేతలు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు.