కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అమావాస్యకి, పున్నమికి హైదరాబాద్ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి పనికి రాని విషయాలు మాట్లాడే బదులు తెలంగాణకు, సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఫైల్స్ లో నవ్వుల పాలయ్యారని కిషన్ రెడ్డి హేళనగా మాట్లాడుతున్నారు. తెలంగాణ పోలీసులను కూడా కించ పరిచేలా మాట్లాడారు.
కిషన్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ మూడేళ్ళలో ఏం చేశారో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో బీజేపీ నేతలు నార్కొ అనాలిసిస్, లై డిటెక్టర్ కు సిద్ధమా అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. దానికి కిషన్ రెడ్డి సిద్ధమా తెలపాలన్నారు. బీజేపీ ఇంత దిగజారుడు రాజకీయం ఎప్పుడూ చేయలేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై బీజేపీ సంబరాలు చేసుకుంటోందన్నారు.
కిషన్ రెడ్డిని గెలిపించి తప్పు చేశామని సికింద్రాబాద్ ఓటర్లు అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. అభివృద్ధిలో మాతో కేంద్ర ప్రభుత్వం పోటీ పడాలి తప్ప దిగజారే రాజకీయాలు చేయొద్దన్నారు. ఎంత సేపు మీటింగ్ లు పెట్టుకోవడం.. మమ్మల్ని తిట్టడమే బీజేపీకి పనా? అంటూ ప్రశ్నించారు. కేసు సీబీఐకి అప్పగిస్తే కోర్టు నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చినట్టా? అని నిలదీశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నట్టుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు.
ఎవరు అధికారం లోకి వస్తారో మాకు తెలుసు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీబీఐ విచారణను స్వాగతిస్తూ కిషన్ రెడ్డి మాట్లాడుతుండటం మాకు అనుమానాలు కలిగిస్తోందన్నారు. బాధ్యత లేకుండా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేంద్రంలో బీజేపీకి అధికారం శాశ్వతం కాదని ఆ పార్టీ నేతలు గ్రహించాలన్నారు. బీజేపీ నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే అది వారి ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.