సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ఆయన ఘటనా స్థలానికి వెళ్లారు. ఘటన జరిగిన తీరుపై అధికారులను అడిగి ఆయన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. భవనం పరిస్థితి ఎలా వుందని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి ఆరాతీశారు.
అనంతరం దక్కన్ మాల్ సమీపంలోని నల్లగుట్ట బస్తీలో ఆయన పర్యటించారు. అక్కడ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో తమకు కంటి మీద కులుకు లేకుండా పోయిందని బస్తీ వాసులు మంత్రితో చెప్పారు.
అగ్ని ప్రమాదానికి గురైన భవనం ఒక్క సారిగా కూలిపోతే తీవ్రంగా నష్టపోతామని బస్తీవాసులు వాపోయారు. దీంతో భవనాన్ని కూల్చి వేస్తామని, ఎలాంటి నష్టం కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. భవనం చుట్టు పక్కల ఉన్న వారికి ఎలాంటి నష్టం కలగకుండా భవనాన్ని కూల్చివేస్తామన్నారు.
భవనం కూల్చివేసే సమయంలో ఎవరికైనా నష్టం జరిగితే వారికి పరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భవనాన్ని కూల్చి వేసేందుకు అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామన్నారు. ఇప్పటికీ భవనం లోపలికి వెళ్లే పరిస్థితి లేదని ఆయన తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. 2008లో ఆగిపోయిన పథకం గురించి కిషన్‌రెడ్డి మాట్లాడారని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మూడు రోజులుగా తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు.