తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర విభజనలో తెలంగాణ, ఏపీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వేం న్యాయం చేశావో చెప్పు అని నిలదీశారు. ఏడేళ్ల పాలనలో తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు.
విభజన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మోడీ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ధార్మిక కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించే మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ అంటే మోడీకి ఎంత కక్ష ఉందో ఆయన మాటల ద్వారానే తెలుస్తోందని తలసాని అన్నారు.
105 రాజ్యాంగ సవరణ చేసినప్పుడు కుక్కల్లా మొరిగే వాళ్లంతా ఎక్కడ పోయారని నిలదీశారు. ప్రధాని పర్యటనకు రాష్ట్ర సర్కారు నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తే సరిపోతుందని అన్నారు. అయినా ప్రధాని పర్యటనను బాయ్ కాట్ చేస్తే తప్పేంటని సంచలన వ్యాఖ్యలు చేశారు తలసాని. ప్రధాని డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తని.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేందుకు డ్రామాలు స్టార్ట్ చేస్తున్నారని ఆరోపించారు.
సమతామూర్తి కార్యక్రమాల్లో పాల్గొనే నైతిక హక్కు ప్రధానికి లేదని అన్నారు. విభజించు, పాలించు సిద్ధాంతంతో.. కులాలు, మతాల పేరుతో బీజేపీ మనుషుల మధ్య కక్షలను రేపుతోందని ఆరోపించారు. శవాల మీద పేలాలు ఏరుకునే పార్టీలు రాజ్యాంగం గురించి మాట్లాడటం చిగ్గు చేటన్నారు. రాజ్యాంగం ప్రకారం విభజన జరిగిందని అన్నారు. ప్రజలకు చిత్త శుద్ది ఉంటే విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని తలసాని డిమాండ్ చేశారు.