జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ కు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ పార్టీ ఎవరికోసం పెట్టారో సోమవారం జరిగిన ఆవిర్భావ సభతో క్లారిటీ వచ్చిందన్నారు. మధ్యాహ్నం మీటింగ్, సాయంత్రం ఫామ్ హౌస్ లో ఉండే వారికి రాజకీయాలు ఎందుకంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి రాజకీయాలకు చేస్తున్నారని.. ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరని మండిపడ్డారు.
సీఎం జోలికొచ్చినా.. వైసీపీ జోలికొచ్చినా సహించేది లేదని అన్నారు. ఇప్పుడు ఇంతలా ఎగసి పడే పవన్.. దేవాలయాలు కూల్చినప్పుడు ఏమయ్యారంటూ నిలదీశారు. పవన్ కళ్యాణ్, నాగబాబుకు తమ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు.
జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనదే అధికారమని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో వివరించారు. తాను ఈ రోజు రాజకీయాల్లో ఉన్నానంటే కారణం తన సోదరుడు నాగబాబు అని అన్నారు. పార్టీలో గెలుపోటములతో సంబంధం లేకుండా నాదెండ్ల మనోహర్ తన వెంటే నడిచారని.. వారికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. ఏపీని అప్పుల్లేని రాష్ట్రంగా చేయాలన్నదే జనసేన లక్ష్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు.
వైసీపీ కొమ్ములు విరుస్తామంటూ హెచ్చరించారు. అందుకోసమే జనసేన షణ్ముఖ వ్యూహం అనుసరించనుందని ప్రకటించారు. అధికారంలోకి రాగానే బలమైన పారిశ్రామిక విధానం తీసుకొస్తామని అన్నారు. విశాఖ, విజయవాడను హైటెక్ నగరాలుగా తీర్చిదిద్దుతామని.. అమరావతిని అభ్యుదయ రాజధానిగా రూపొందిస్తామని పవన్ చెప్పారు. వైసీపీ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అడుగడుగునా విధ్వంసమే కనిపిస్తోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు.