ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది. ఈ స్కాంలో మొదటి నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో కవిత విచారణ జరగనుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఇతర నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు కేటీఆర్, కవిత న్యాయనిపుణులతో చర్చలు జరిపారు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ కవితకు భారీగా మద్దతు లభిస్తోంది. బీఆర్ఎస్ నేతలు కవితకు సపోర్ట్ చేస్తూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కవితకు మద్దతునిస్తూ ట్వీట్ చేశారు.
“పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తాయి. అంత మాత్రాన వేట ఆపుతామా?.. కవితమ్మా ధైర్యంగా ఉండండి” అంటూ ఎమ్మెల్సీ కవితకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ‘’కేసీఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మపోరాటంలో మీతో పాటు ఉన్నాం.. భవిష్యత్‌లోనూ ఉంటాం. ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే.. మనదే’’ అంటూ మంత్రి వేముల ట్వీట్ చేశారు.