గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశం ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగానికి గవర్నర్ ను ఆహ్వానించేందుకు సోమవారం మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పలువురు అధికారులు రాజ్ భవన్ కి వెళ్లారు.
కాగా గవర్నర్ తమిళిసై విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. గవర్నర్ పై దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ తరపు లాయర్ దుశ్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు.
గవర్నర్ ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో బడ్జెట్ తేదీ మార్పుపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 3వ తేదీ బదులు 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది.
సాధారణంగా రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో శాసన సభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందుకు విరుద్ధంగా గతేడాది బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.