ఇండియాను తప్పుడుగా చూపుతూ వాట్సాప్ పోస్ట్ చేసిన ఓ గ్రాఫిక్ కి కేంద్రం షాకిచ్చింది. ఈ గ్రాఫిక్ లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ను, చైనా తమవిగా చెప్పుకుంటున్న భారత భూభాగాలను ఇండియాలో చేర్చని విధంగా ఉన్న ఈ మ్యాప్ పట్ల కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వాట్సాప్ కి వార్నింగ్ ఇచ్చారు. దీంతో దిగి వచ్చిన వాట్సాప్ ఆ మ్యాప్ ని డిలీట్ చేసి క్షమాపణ చెప్పింది.
ఈ తప్పుడు మ్యాప్ ని తక్షణమే సరిదిద్దాలని ఆదేశించిన రాజీవ్ చంద్రశేఖర్.. ఇండియాలో ‘బిజినెస్’ చేస్తున్న, లేదా చేయగోరిన ఇలాంటి అన్ని వేదికలు తప్పనిసరిగా సరైన మ్యాప్ లను ఉపయోగించాలని కోరారు. ఫేస్ బుక్, ఇన్స్ టా గ్రామ్ వంటివాటికి కూడా ఆయన ఇలాంటి ఆదేశాలను జారీ చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా వాట్సాప్ తన మల్టీ లొకేషన్ లైవ్ స్ట్రీమ్ లో ఈ మ్యాప్ ని ప్రచురించిన కొన్ని గంటల్లోనే రాజీవ్ చంద్రశేఖర్ దీన్ని గుర్తించారు. మెటాకు సందేశం పంపారు.
దీనిపై స్పందించిన మెటా వర్గాలు.. ఇందులో తమ దురుద్దేశాలేవీ లేవని, ఈ పొరబాటును గుర్తించినందుకు ధన్యవాదాలని ఆయనకు రిప్లయ్ ఇచ్చాయి. పైగా వెంటనే ఈ తప్పుడు మ్యాప్ ని వాట్సాప్ తొలగించింది. అపాలజీ చెబుతూ ..భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చింది.
ఇటీవల వీడియో కాలింగ్ కంపెనీ జూమ్ ఫౌండర్ ఎరిక్ యువాన్ కి కూడా ఈ మంత్రి ఝలక్ ఇచ్చారు. ఇండియా మ్యాప్ పట్ల పొరబాట్లు చేయడం తగదని, మీరు ఇక్కడ బిజినెస్ చేయదలిస్తే.. ఇలాంటివాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దాంతో జూమ్ కూడా ఆ తప్పుడు పోస్ట్ ని తొలగించింది. 2021 లో ట్విట్టర్.. వక్రీకరించిన ఇండియా మ్యాప్ ని ప్రచురించి నాలుక్కరుచుకుంది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆ తరువాత దాన్ని డిలీట్ చేసింది. ఇలా భారత దేశాన్ని తప్పడుగా చూపితే పోలీసు కేసు నమోదు చేస్తారు. . సదరు పొరబాటుకు సంబంధిత సంస్థ వర్గాలు జైలుకు కూడా పోవలసి ఉంటుంది.